న్యూఢిల్లీ, జులై 28: మంచి ఉద్దేశంతో పరీక్షల సంస్కరణల బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మద్దతు ఇస్తుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే.టి. రామారావు స్పష్టం చేశారు. మంగళవారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, కొత్త బిల్లులు తీసుకురావడానికి ముందు గత తప్పుల నుంచి ప్రభుత్వం ఏమి నేర్చుకుందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
ఎన్డీయే ప్రభుత్వ హయాంలో ఐదుసార్లు పేపర్ లీక్‌లు జరిగాయని, వాటిలో మూడుసార్లు ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే జరిగాయని కేటీఆర్ ఆరోపించారు. ప్రస్తుతం దేశానికి జవాబుదారీతనం, పారదర్శకత, దీర్ఘకాలిక సంస్కరణలు అవసరమని పేర్కొన్నారు.
డాక్టర్ కె. రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సుల అమలుపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని కోరిన కేటీఆర్, నందన్ నీలేకని కమిటీ ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం ద్వారా రాజకీయ గందరగోళం సృష్టించారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో లోక్‌సభ స్థానాల పెంపు చట్టంలో ఉన్నప్పటికీ, 12 ఏళ్లుగా అమలు కాలేదని ఆయన అన్నారు. పార్లమెంట్ ఆమోదించిన చట్టాలనే అమలు చేయని ప్రభుత్వం కొత్త హామీలను ఎలా నెరవేరుస్తుందనే సందేహం ప్రజల్లో ఉందని వ్యాఖ్యానించారు.
రాజ్యాంగం ప్రకారం ప్రతి జనాభా లెక్కల తర్వాత లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంటుందని గుర్తు చేసిన కేటీఆర్, డీలిమిటేషన్ కారణంగా దక్షిణ భారత రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.