పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో ఎన్నికల బహిష్కరణ ఉద్యమం హింసాత్మకంగా మారిందని స్థానిక వర్గాలు ఆరోపిస్తున్నాయి. రావలకోట్‌లో జరిగిన నిరసనల సందర్భంగా భద్రతా బలగాల కాల్పుల్లో 20 మంది మరణించగా, 50 మందికిపైగా గాయపడినట్లు సమాచారం. అయితే ఈ ఘటనపై పాకిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు

ఇంటర్నెట్ డెస్క్: పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో ఎన్నికల బహిష్కరణ ఉద్యమం ఉద్రిక్తంగా మారింది. రావలకోట్‌లోని డ్రేక్ ఎయిత్ ప్రాంతంలో ఎన్నికల బహిష్కరణకు మద్దతుగా నిర్వహించిన నిరసనల సందర్భంగా పాకిస్థాన్ భద్రతా బలగాలు కాల్పులు జరిపినట్లు స్థానిక వర్గాలు ఆరోపించాయి.

స్థానిక సమాచారం ప్రకారం, ఈ కాల్పుల్లో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ప్రతినిధి ఉమర్ నజీర్ కాశ్మీరీ సోదరుడు ఉస్మాన్ నజీర్ సహా 20 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికిపైగా గాయపడ్డారు. జూన్ 5 నుంచి కొనసాగుతున్న నిరసనల్లో ఇప్పటివరకు సుమారు 80 మంది మరణించినట్లు కూడా స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో రోడ్లపై మృతదేహాలు కనిపించడం, గాయపడిన వారిని స్థానికులు తరలిస్తున్న దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. పీవోకేకు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అఖీల్ భాయ్ విడుదల చేసిన వీడియోలో, రావలకోట్‌లో పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, అంతర్జాతీయ మీడియా మరియు మానవ హక్కుల సంస్థలు వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల బహిష్కరణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న అవామీ యాక్షన్ కమిటీ (AAC) సభ్యులనే భద్రతా బలగాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయని స్థానిక వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో శాంతిభద్రతల కోసం 14 వేల మందికిపైగా సాయుధ భద్రతా సిబ్బందిని ఇస్లామాబాద్ మోహరించినట్లు సమాచారం.

అయితే, కాల్పుల ఘటనపై లేదా స్థానిక వర్గాల ఆరోపణలపై పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు స్వతంత్రంగా ధృవీకరించబడలేదు.