అమరావతి, జులై 28: ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖలో చేపడుతున్న సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు తెలిపిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. కాకినాడలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)లో స్టీమ్ రైస్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు తెలిపారు. అదనంగా 20 వేల మెట్రిక్ టన్నుల పార్బాయిల్డ్ ధాన్యం సేకరణకు కేంద్రం అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు.
రేషన్ దుకాణాల ద్వారా 'మీ మార్ట్' కాన్సెప్ట్‌ను అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే రైతు బజార్లలో తక్కువ ధరలకు నాణ్యమైన బియ్యాన్ని అందించే కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణ వెరైటీ బియ్యాన్ని కిలో రూ.40కు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
రేషన్ కార్డుదారులకు 500 గ్రాముల కందిపప్పు పంపిణీ చేసే ప్రతిపాదనను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. పౌరసరఫరాల శాఖకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న రూ.281 కోట్ల నిధుల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పారు. ధాన్యం రవాణా, నిల్వల పర్యవేక్షణ కోసం ఆర్‌ఎఫ్‌ఐడీ (RFID) సాంకేతికతను అమలు చేస్తున్నామని, డిజిటల్ వాలెట్ విధానం ద్వారా సబ్సిడీల పంపిణీకి పైలట్ ప్రాజెక్టును చేపడుతున్నామని వెల్లడించారు.
ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ల కమిషన్ పెంపునకు కూడా కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 29 వేల రేషన్ దుకాణాలను మరింత బలోపేతం చేయనున్నట్లు పేర్కొన్నారు. బియ్యం ధరల స్థిరీకరణ కోసం మిల్లర్లతో చర్చలు జరిపామని, ప్రస్తుతం కిలో బియ్యం ధర రూ.52 వద్ద ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణ వెరైటీ బియ్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.