హైదరాబాద్, జులై 28: తెలంగాణలో టెలివిజన్ రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీవీ అవార్డులను ప్రవేశపెట్టే ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి టెలివిజన్ అవార్డు కమిటీ సభ్యులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమావేశంలో అవార్డులకు ప్రత్యేక పేరు, లోగో, వివిధ కేటగిరీల రూపకల్పనపై విస్తృతంగా చర్చించారు. తెలంగాణ ఆత్మను ప్రతిబింబించేలా అవార్డుల పేరు, లోగో ఉండాలని మంత్రి సూచించారు. టెలివిజన్ రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తోందని ఆయన పేర్కొన్నారు.
టీవీ అవార్డులకు మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు పేరు పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి వెల్లడించారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
అవార్డుల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరితగతిన సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాలని టెలివిజన్ అవార్డు కమిటీ సభ్యులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో టెలివిజన్ రంగానికి మరింత గుర్తింపు, ప్రోత్సాహం కల్పించే దిశగా ఈ అవార్డులు కీలకంగా మారనున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.