చిత్తూరు, జులై 28: యువత అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సూచించారు. కుప్పం పర్యటనలో భాగంగా రెండో రోజు మంగళవారం స్థానిక పీఈఎస్ వైద్య కళాశాల ఆడిటోరియంలో విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో ఆమె ప్రసంగించారు.
ఈ సందర్భంగా విద్యార్థుల క్రీడా ప్రదర్శనలను వీక్షించిన భువనేశ్వరి, క్విజ్ పోటీలో పాల్గొన్న విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం మాట్లాడుతూ, కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులకు పిల్లలు అండగా నిలవాలని, మంచి వ్యక్తులతో స్నేహం వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని చెప్పారు.
తన మనవడు దేవాన్ష్ పుస్తకాలు ఎక్కువగా చదువుతాడని, టీవీ, మొబైల్‌కు దూరంగా ఉంటాడని ఉదాహరణగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని, విద్యార్థుల చదువుకు చేయూతగా ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకం ద్వారా ఒక్కో విద్యార్థికి రూ.15,000 ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషితో 1.06 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని వివరించారు.
యువత మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. డ్రగ్స్ వ్యసనం జీవితాలను నాశనం చేస్తుందని, పరీక్షల్లో విఫలమైనా నిరాశ చెందకుండా ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఆత్మహత్య వంటి ఆలోచనలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలని, వారి రుణం ఎప్పటికీ తీర్చలేమని అన్నారు.
గురువులను గౌరవించాలని, మహాత్మా గాంధీ, నరేంద్ర మోదీ వంటి మహనీయుల నుంచి స్ఫూర్తి పొందాలని విద్యార్థులకు సూచించారు. లక్ష్యంతో కృషి చేస్తే టీచర్, ఇంజినీర్, డాక్టర్, వ్యాపారవేత్త, పోలీస్ అధికారి, ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని, క్రమశిక్షణతో జీవిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని నారా భువనేశ్వరి పేర్కొన్నారు.