ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరుసగా విరిగిపడుతున్న కొండచరియల కారణంగా చార్‌ధామ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్ పడింది. యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మంగళవారం, బుధవారం రోజుల్లో చార్‌ధామ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో యాత్రా మార్గాలు దెబ్బతిన్నాయి. రహదారులపై భారీగా రాళ్లు, మట్టి పేరుకుపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాతావరణ పరిస్థితులు పూర్తిగా అనుకూలించిన తర్వాత, రహదారులను శుభ్రపరిచి సురక్షితమని నిర్ధారించిన అనంతరం యాత్రను తిరిగి ప్రారంభిస్తామని గర్హ్వాల్ డివిజనల్ కమిషనర్ తెలిపారు.
ఇదిలా ఉండగా, ముంకటియా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో కేదార్‌నాథ్ హైవే పూర్తిగా మూసివేయబడింది. రహదారిపై పడిన భారీ రాళ్లు, శిలలు, మట్టిని తొలగించేందుకు యుద్ధప్రాతిపదికన భారీ యంత్రాలతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
జిల్లా యంత్రాంగం, పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు సమన్వయంతో పనిచేస్తూ యాత్రికుల భద్రత కోసం అన్ని చర్యలు చేపడుతున్నాయి. యాత్ర నియంత్రణ కేంద్రం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు జారీ చేస్తోంది.
అధికారులు అనుమతి ఇచ్చే వరకు ఎవరూ చార్‌ధామ్ యాత్రకు బయలుదేరవద్దని, అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని యాత్రికులకు సూచించారు.