అంగన్వాడీలకు సంబంధించిన అంశంలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే అంగన్వాడీలకు "తల్లికి వందనం" పథకం అమలు చేశామని, పెనమలూరులో అంగన్వాడీలు నిర్వహించిన కృతజ్ఞత ర్యాలీని వైసీపీ నిరసన ర్యాలీగా చిత్రీకరిస్తోందని ఆరోపించారు.

అమరావతి, జులై 28: అంగన్వాడీల విషయంలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ కార్యకర్తలకు అమ్మఒడి పథకం అమలు కాలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీలకు "తల్లికి వందనం" పథకాన్ని వర్తింపజేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని తెలిపారు.

పెనమలూరు నియోజకవర్గంలో తన పర్యటన సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు నిర్వహించిన కృతజ్ఞత ర్యాలీని వైసీపీ నేతలు కావాలనే నిరసన కార్యక్రమంగా ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఈ అంశంపై సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా స్పందించిన మంత్రి "ఫేక్ వర్సెస్ రియల్" పేరుతో ఓ వీడియోను విడుదల చేశారు.

అంగన్వాడీల పేరుతో విషప్రచారం చేస్తున్నారని ఆరోపించిన మంత్రి, కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందన్నారు. వైసీపీ హయాంలో అంగన్వాడీలకు అమ్మఒడి అందకుండా అన్యాయం జరిగిందని విమర్శించారు.

"కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అంగన్వాడీలకు వర్తింపజేయడంతో వారు ఆనందంగా పెనమలూరు పర్యటనలో కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఆ కృతజ్ఞత ర్యాలీని నిరసన ర్యాలీగా చూపిస్తూ వైసీపీ విషప్రచారం చేస్తోంది" అని మంత్రి నారా లోకేశ్ ఎక్స్‌లో చేసిన పోస్టులో పేర్కొన్నారు.