ఇంటర్నెట్ డెస్క్, జులై 27: జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తన విజయ రహస్యాన్ని వెల్లడించాడు. సిరీస్‌లో రెండు అర్ధ సెంచరీలు సాధించిన అతడు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.
బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైభవ్ మాట్లాడుతూ.. "నా కల నెరవేరింది. అంతర్జాతీయ క్రికెట్‌లో తొలిసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. నా మీద నాకు ఉన్న నమ్మకమే ఈ ప్రదర్శనకు కారణం" అని తెలిపాడు.
జట్టుకు మంచి ఆరంభం అందించడమే తన ప్రధాన లక్ష్యమని, ఒకసారి మంచి స్టార్ట్ లభిస్తే దానిని పెద్ద ఇన్నింగ్స్‌గా మలచేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. హరారేకు వచ్చిన తర్వాత రెండు, మూడు రోజులపాటు జట్టు సన్నాహాలు ఎంతో చక్కగా జరిగాయని వెల్లడించాడు.
అండర్-19 ప్రపంచకప్‌లో కూడా హరారేలో ఆడిన అనుభవం తనకు ఉపయోగపడిందని వైభవ్ పేర్కొన్నాడు. కెప్టెన్, కోచ్‌లు, జట్టు సభ్యులంతా తనపై నమ్మకం ఉంచి పూర్తి మద్దతు ఇవ్వడం వల్లే ఆత్మవిశ్వాసంతో ఆడగలిగానని, వారి ప్రోత్సాహం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని యువ బ్యాటర్ వివరించాడు.