హైదరాబాద్, జులై 27: రాష్ట్రంలో హైడ్రాను నిషేధిస్తేనే పేదల ఇళ్లు సురక్షితంగా ఉంటాయని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్‌ను పదవి నుంచి తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సోమవారం ఆయన ఈ అంశంపై స్పందించారు.
హైకోర్టు తీర్పును స్వాగతించిన రాంచందర్ రావు, ఈ తీర్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించారు. రంగనాథ్‌ను బలిపశువుగా చేశారని ఆరోపించారు. హైడ్రా వ్యవస్థ రేవంత్ రెడ్డి, ఎంఐఎం కనుసన్నల్లో పనిచేసిందని విమర్శించారు.
ఫాతిమా కాలేజీ వంటి పెద్ద సంస్థలు, ప్రభావశీలులపై హైడ్రా చర్యలు తీసుకోలేదని, ప్రారంభం నుంచే పేదల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుందని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో హైడ్రాను పూర్తిగా రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాగా, లోతుకుంట భూముల కేసు విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం సెక్రటరీ హోదాలో ఉన్న అధికారికి తగదని పేర్కొంటూ, ఆయనను పదవి నుంచి తొలగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.
అలాగే అర్హత కలిగిన అధికారిని హైడ్రా కమిషనర్‌గా నియమించాలని హైకోర్టు స్పష్టం చేసింది. రంగనాథ్ అదే పదవిలో కొనసాగితే న్యాయపాలన (Rule of Law) దెబ్బతింటుందని, పలుమార్లు ఉల్లంఘనలకు పాల్పడిన అధికారిని అదే పోస్టులో కొనసాగించడం సమంజసం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది.
హైకోర్టు ఆదేశాలను బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు స్వాగతించాయి.