హైడ్రా చీఫ్ ఎ.వి. రంగనాథ్‌ను తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. రంగనాథ్‌కు మద్దతుగా నిలవడంతో పాటు, హైకోర్టు తీర్పుపై డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసేందుకు ప్రభుత్వం న్యాయ సలహా తీసుకుంటున్నట్లు సమాచారం.

హైదరాబాద్, జులై 27: హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్‌ను పదవి నుంచి తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తదుపరి కార్యాచరణపై దృష్టి సారించింది. హైడ్రా చీఫ్‌కు మద్దతుగా నిలవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

ఈ అంశంపై న్యాయ నిపుణుల అభిప్రాయం (లీగల్ ఒపీనియన్) తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్‌ను న్యూఢిల్లీకి పంపినట్లు సమాచారం. అలాగే గతంలో నమోదైన కోర్టు ధిక్కరణ పిటిషన్లను కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

హైకోర్టు పూర్తి తీర్పు ప్రతిని పరిశీలించిన అనంతరం, సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

కాగా, లోతుకుంట భూముల కేసు విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం సెక్రటరీ హోదాలో ఉన్న అధికారికి తగదని వ్యాఖ్యానిస్తూ, ఆయనను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.

అర్హత కలిగిన అధికారిని హైడ్రా కమిషనర్‌గా నియమించాలని హైకోర్టు సూచించింది. 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లను ప్రస్తావిస్తూ, రంగనాథ్ అదే పదవిలో కొనసాగితే న్యాయపాలన (Rule of Law) దెబ్బతింటుందని పేర్కొంది. పలుమార్లు ఉల్లంఘనలకు పాల్పడిన అధికారిని అదే పదవిలో కొనసాగించడం సమంజసం కాదని, ఆయనను తొలగించడం తప్ప మరో మార్గం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.